Friday, 13 March 2015

ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న

మానవ సేవే మాధవ సేవ’ అన్నారు. ‘ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న’ అంటారు. మానవజాతి చరిత్రలో సేవాభావంతో జీవించి సేవ చేసిన వ్యక్తులు చిరస్మరణీయంగా ఉండిపోయారు. ప్రతిఫలాపేక్ష లేకుండా సమర్పణా భావంతో చేసే ప్రతిపని ‘సేవ’ అవుతుంది. ఆశించి చేయడం వ్యాపారం! ఆశించకుండా చేయడమే మానవత్వం!!
ఫలితాన్ని ఆశించి చేయడమంటే బంధంలో ఇరుక్కుపోవడమే. ఇది ఒక రకమైన ఆత్మవంచనే. ముందు మనం చేయవలసింది చేయాలి, రాబోయే ప్రతిఫలాన్ని గురించి ఆలోచించకూడదు. ‘నా జీవితం, నా జీవితంలోని ప్రతి అంశం ఈ సమాజానికి ఉపయోగపడాలి’ అని నిరంతరం పరితపించడమే ‘సేవ’. ‘నా ప్రతి ఆలోచన, భావన, కదలిక, మాట, చేసేపని ఈ సమాజపు పురోభివృద్ధికి తోడ్పడాలి’ అని చేసేదే సేవ అవుతుంది. ‘నా ద్వారా ఈ ప్రపంచానికి ఏమి జరగాలి?’ అని ఆలోచిస్తూ జీవించడమే సేవ అవుతుంది. ఈ ప్రపంచం సస్యశ్యామలమై ఒక ఆదర్శ ప్రపంచంగా తయారు కావాలనే దృక్పథంతో చేసే ప్రతి కార్యక్రమం సేవలో ఒక భాగమే.
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు! ప్రపంచమే పరమాత్మ, పరమాత్మే ప్రపంచం!! ఈ ప్రపంచానికి సేవ చేయడమంటే పరమాత్మకు సేవ చేయడమే. ‘ప్రపంచానికి భిన్నంగా పరమాత్మలేడు...!’ పరమాత్మ ప్రత్యేకంగా ఎక్కడో లేడు. నీ చుట్టూ ఉన్న ప్రపంచంలోనే ఉన్నాడు. ప్రపంచంనుండి మనం అన్నింటినీ నిరంతరం పొందుతూనే వున్నాం. తలకు నూనె దగ్గరనుండి కాళ్లకు పాదరక్షల వరకు, మనకు అవసరమైన అన్ని వస్తువులూ వసతులూ ప్రపంచంనుండి వస్తున్నాయి. ఒక వస్తువు మన చేతికి వచ్చిదంటే దాని వెనుక కొన్ని వందలమంది శ్రమ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటుంది. సమాజం లేకుండా మానవ మనుగడ కొనసాగే అవకాశమే లేదు. మానవుడు సంఘజీవి. సమాజం మీద ఆధారపడి తాను అన్నీ పొందుతున్నప్పుడు అందుకు ప్రతిఫలంగా సమాజానికి తప్పనిసరిగా కృతజ్ఞతా పూర్వకంగా ఏదో ఒకటి చేయవలసిందే. లేకపోతే ఋణగ్రస్తుడవుతాడు.
కాబట్టి ప్రపంచానికి సేవచేయడమంటే మన కుటుంబానికి సేవచేసుకోవడమే. అందరూ మనవాళ్ళే. అంతా మనదే. ఉన్నది ఒకే జాతి. మానవజాతి. ఉన్నడి ఒకే కులం - మానవ కులం. ఉన్నది ఒకే కుటుంబం -వసుదైక కుటుంబం.
సేవా భావంతో జీవించే వ్యక్తి మానసిక మట్టాన్ని దాటి హృదయమట్టంలో జీవిస్తాడు. హృదయమట్టం వికసించడంద్వారా పరిమితతత్వం కరిగిపోతుంది. మనసులో ఎటువంటి పరిధిగాని పరిమితిగాని ఉండవు. ‘నేను, నాది, నాకు’ అనే భావన కన్నా - అంతానాది, అందరూ నా వాళ్ళు, అంతా నేనే అనే విశాల భావం ఏర్పడుతుంది.
సత్వగుణం సులభంగా అలవడుతుంది. రాగద్వేషాలు కామక్రోధాలు ఉండవు. సంపూర్ణ ఆరోగ్యంతోపాటు లోతైన ఆలోచనా విధానం ఉంటుంది. విశిష్ట లక్షణాలతో కూడిన వ్యక్తిత్వం అనూహ్యంగా వికసిస్తుంది. ధైర్యం - ఆత్మ విశ్వాసాలంతో ముందుకు దూసుకొనిపోయి గొప్ప వ్యక్తిగా రాణించడం జరుగుతుంది. వ్యక్తిగత ప్రలోభాలు లేకుండా ఉత్తమ దృక్పథం ఉంటుంది. కాబట్టి ప్రపంచాన్ని ప్రభావితం చేయగల సమర్దత ఉంటుంది.

No comments:

Post a Comment