సాయి మంత్రం
షిరిడీపురమే చిన్మయధామం
సాయి నామమే శుభమంత్రం
సాయి నామమే శుభమంత్రం ... శ్రీ
సాయి నామమే శుభమంత్రం || షిరిడీ ||
ఆర్తు లందరికి అభయము నిచ్చి
ఆదరించు సద్గురు మంత్రం ..................... || షిరిడీ ||
భవరోగమ్ముల భరతం పట్టే
వైద్యశిఖామణి ఘనమంత్రం
సాయి నామమే శుభమంత్రం ... శ్రీ
సాయి నామమే శుభమంత్రం || భవ ||
గురువుల గురువై అజ్ఞానమ్మును
తరిమికొట్టు సద్గురుమంత్రం .................... || షిరిడీ ||
అరిషడ్వర్గము లంతముచేసి
ఆదుకొనే తారకమంత్రం
సాయినామమే శుభమంత్రం ... శ్రీ
సాయి నామమే శుభమంత్రం || అరి ||
పాపాలను విచ్ఛిన్నం చేసి
పాలించే పావనమంత్రం .......................... || షిరిడీ ||
సర్వదేవతా స్వరూపుడైన
సాయిని చూపే సన్మంత్రం
సాయి నామమే శుభమంత్రం ... శ్రీ
సాయి నామమే శుభమంత్రం || సర్వ ||
చిత్తశాంతి చేకూర్చి జన్మమును
తరింపజేసే చిన్మంత్రం ........................... || షిరిడీ ||
దీపస్తంభం
తీరం తెలియని సముద్రయానంలో
దారిని చూపే దీపస్తంభంలా
భవసాగరమును తరింపజేసెడివై
బాబా కథలే దారిని చూపునులే
బాబా కథలే గమ్యం చేర్చునులే
అమృతధారలను మించే మధురిమతో
అగ్నిత్రయమును మించు పవిత్రతతో
చెవుల సోకి హృదయానికి చేరునులే
జీవితముల శోభిల్లగ జేయునులే
బాబా కథలే కాంతిని నింపునులే ........... || తీరం ||
తనువు మీది అభిమానం తొలగించి
ద్వంద్వభావ గర్వాలను నిర్జించి
జ్ఞానకాంతులను మదిలో నింపునులే
సర్వపాప సంఘాలను చంపునులే
బాబా కథలే నీతులు నేర్పునులే ........... || తీరం ||
అధిక మోహమును స్వార్థము నడగించి
ఆత్మను సాక్షాత్కర మ్మొనరించి
గురుభక్తిని మన ఎదలో నింపునులే
పరమాత్ముని సన్నిధికే చేర్చునులే
బాబా కథలే మోక్షము నిచ్చునులే ........ || తీరం ||
సాయీ! నీ మహిమ
సాయీ! నీ మహిమాతిశయమ్మును
సన్నుతి జేసి తరింపగా
వేయిముఖమ్ముల శేషుడు కూడ
చాలడంటె మరి నా తరమా? || సాయీ ||
షిరిడీవాసా! చిన్మయరూపా!
కరుణాసాగర! వరదాతా!
భక్తజనులు నీ పాదపద్మములు
స్మరించుచుందురు నిరంతరం
మాయామోహము నశింపజేసి
ఉద్ధరించెదవు దయామూర్తివై ........... || సాయీ ||
మానవజన్మము నెత్తి నరులకు
మోక్షమార్గమును చూపించితివి
సర్వకాల సర్వావస్థలలో
సంస్కరించెదవు క్షమామూర్తివై ......... || సాయీ ||
నీటితోడ వెలిగించి దీపములు
జ్ఞానకాంతులను వెదజల్లితివి
నిన్ను నమ్మి నీ దరికి జేరగా
మన్నించెదవు యోగిరాజువై ............ || సాయీ ||
ఓం సాయి! శ్రీ సాయి! జయజయ సాయి!
ఓం సాయి! శ్రీ సాయి! జయజయ సాయి! ........
మాయలకు లొంగకుండ
మాయలకు లొంగకుండ భక్తి మీరగా
సాయి భజన చేయరండు సుజనులారా || మాయలకు ||
వందనాలు చేయండి సేవించండి || వందనాలు ||
అందరికీ దిక్కు కదా సాయిబాబా .....................................
|| మాయలకు ||
ప్రతినగరం ప్రతిగ్రామం వాడవాడలా
సాయినాథ మందిరాలు విలసిల్లాలి || ప్రతినగరం ||
ప్రతి ఒక్కరి హృదయంలో సద్గురు సాయి || ప్రతి ఒక్కరి||
నెలకొని చూపించాలి మోక్షమార్గము ...............................
|| మాయలకు ||
తల్లి తండ్రి హితుడు గురువు దైవమాతడే
సుఖసంపద లిచ్చి మనల బ్రోచునాతడే || తల్లి తండ్రి ||
సర్వదేవ వందనాలు పొందునాతడే || సర్వదేవ ||
సర్వమత జనమ్ముల శరణ్యుడాతడే ................................
|| మాయలకు ||
అతని రూపు మనకన్నుల దివ్యజ్యోతి
కర్ణరసాయన మాతని జ్ఞానబోధనం || అతని ||
సుధామధుర మతని నామ మగును జిహ్వకు || సుధా ||
అతడే మన పతి గతి యని స్తుతులు చేయరా ................... || మాయలకు ||
ఓం సాయి! శ్రీ సాయి! జయజయ సాయి! || ఓం సాయి ||
జయజయ సాయీ! జయజయ సాయీ!
సాయికి మా వందనం
గోదావరీతీర షిరిడిపురములో
విలసిల్లు సాయికి మా వందనం - కరుణ
కురిపించు సాయికి మా వందనం
కాపాడు సాయికి మా వందనం - జనుల
పాలించు సాయికి మా వందనం .................... || గోదావరీ ||
అఖిలాండకోటి బ్రహ్మాండవిభుడుగా
భాసించు బాబాకు మా వందనం - కష్ట
ముల బాపు బాబాకు మా వందనం
వరము లిచ్చు బాబాకు మా వందనం - సుఖము
లను గూర్చు బాబాకు మా వందనం ............. || గోదావరీ ||
అజ్ఞానమును బాపి జ్ఞానము నొసగే
సౌజన్యమూర్తికి మా వందనం - మూడు
లోకాల కర్తకు మా వందనం
పాపాల హర్తకు మా వందనం - పంచ
భూతాల భర్తకు మా వందనం ..................... || గోదావరీ ||
భక్తులందరి హృదయ మందిరములలో
నెలకొన్న పాదునకు మా వందనం - వేద
వేదాంత విదునకు మా వందనం
జ్ఞానసంపదునకు మా వందనం - ప్రణవ
సన్మంత్రనాదునకు మా వందనం ............... || గోదావరీ ||
పుణ్యమూర్తి సాయీ!
పుణ్యమూర్తి సాయీ! మా - పూజ లందుకోవయ్యా || పుణ్య ||
అగణిత మహిమాన్వితా! - ఆదుకొనగ రావయ్యా || అగణిత ||
తలచినంత బ్రోచు దయా - జలనిధి కిదె ‘ధ్యానము’
పిలిచినంత పలుకు వేద - విదునకు ‘ఆవాహనం’
భక్తలోక హృదయపీఠ - వాసున కిదె ‘ఆసనం’
సజ్జన ప్రశస్త సేవ్య - చరణున కిదె ‘పాద్యము’ .................... || పుణ్య ||
ఆపన్నజనోద్ధారక - హస్తున కిదె ‘అర్ఘ్యము’
సాయి కిదే ‘అర్ఘ్యము’
వరములు కురిసే ప్రసన్న - వదనున కిదె ‘ఆచమనం’
సాయి కిదే ‘ఆచమనం’
దినకరశత తేజోమయ - దేహున కిదె ‘స్నానము’
శివకేశవ రూపధారి - చిన్మయునకు ‘వస్త్రయుగం’
సదమల సత్కీర్తియుతున - కిదియే ‘ఉపవీతము’
బంధనాలు ద్రెంచు లోక - బాంధవునకు ‘గంధము’
క్షతివిరహిత సౌజన్యసు - గతున కివియె ‘అక్షతలు’ || క్షతి ||
సుమకోమల మానస పరి - శుద్ధున కిదె ‘పుష్పము’ ......... || పుణ్య ||
షిరిడీపుర నిలయుడగు వి - శిష్టున కిదె ‘ధూపము’
సాయి కిదే ‘ధూపము’
జ్ఞానశూన్య మనోతిమిర - సంహారికి ‘దీపము’
సాయి కిదే ‘దీపము’
భక్తుల ఆకలిని దీర్చు - స్వామికి ‘నైవేద్యము’
చర్విత వేదోపనిషద్ - జ్ఞానికి ‘తాంబూలము’
కమనీయాకారున కిదె - ‘కపురపు నీరాజనం’
హిమకర దినకర నేత్రున - కిదియె ‘మంత్రపుష్పము’
చరాచరప్రపంచ కుక్షి - ధరున కిదె ‘ప్రదక్షిణం’ || చరా ||
ఇష్టకామ్యదాత కిదే - ‘సాష్టాంగవందనం’
................................ || పుణ్య ||
శ్రీకరా! చిదంబరా!
శ్రీకరా! చిదంబరా! గురువరా! పరాత్పరా!
చిన్మయా! కృపాకరా! షిరిడి సాయి! పాహిమాం
సదా భజామి సాయిరాం!
సదా స్మరామి సాయిరాం!
.................................|| శ్రీకరా ||
మనోహరం మనోహరం త్వదీయ నామకీర్తనం || మనో ||
తమోహరం తమోహరం త్వదీయ రూపదర్శనం .....|| శ్రీకరా ||
శుభంకరం శుభంకరం త్వదీయ పాదసేవనం || శుభం ||
సుఖంకరం సుఖంకరం త్వదీయ బోధపాలనం .......|| శ్రీకరా ||
జయప్రదం జయప్రదం త్వదీయ సుగుణవర్ణనం || జయ ||
హితప్రదం హితప్రదం త్వదీయ ఊదిధారణం ..........|| శ్రీకరా ||
No comments:
Post a Comment